గణపతి నవరాత్రులు- పద్యపూజ
మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
1)
చం॥
గజముఖ! వక్ర తుండ!యుమ కల్పన జేసిన ముద్దురూపమా!
భుజములు నాల్గు గల్గిన విభూతి దలంపగమాకు శక్యమే!
వ్రజమును గానమయ్య పదపద్మము బట్టక యాఖువాహనా!
విజయము నిమ్ముకార్యముల విఘ్నములై నెరవేర దేవరా!
వ్రజము= దారి
కం॥
కదళిని దక్షిణ కరమున
పదిలంబుగ చెఱకుగడను వామము నందున్
కుదురుగ బట్టిన గణపతి
ముదమును గలిగించె బర్వి మోదకములకై !
ఉ॥
బాలుడు ముద్దుగూనయని ఫాలుడు దల్పక వ్రేటువేయగన్
గోలుమనేడ్చునా యగజ కోరిక దీర్పనేన్గుశీర్షమా
బాలుకమర్పనా శిశువు ప్రాణము బొందెను శంభుశక్తితోన్
బాలగణాధిపున్ గొలువ బల్కుల తల్లియొసంగు విద్యలన్ !
——————-
డా. ఉమాదేవి జంధ్యాల
2)
గణపతి నవరాత్రులు సందర్భంగా రెండవ రోజు..
తరుణ గణపతి
1)సీ॥
అరుణవర్ణముగలఁ దరుణగణపతిని
బూజింపఁగార్యముల్ బూర్తి యగును
చెరకుగడనుబట్టి చెరుపునుఁబోగొట్టి
సరిజేయు మార్గంబు సవ్యముగను!
పాశాంకుశాదులన్ బట్టిహస్తములందు
పాపాత్ములబనిని బట్టునితడు!
అగజాననుండిచ్చు యౌవనోత్సాహముల్
గొల్వగ యువకులు గూర్మితోడ!
ఆపదలదీర్చు నర్థింప నార్తితోడ
వృత్తి వ్యాపారములయందు వృద్ధినిచ్చు!
పారద్రోలును నిస్పృహ భయము బాపు!
తరుణ గణపతి గొల్వుడిత్తరుణ మందు!
కం॥
కదళిని దక్షిణ కరమున
పదిలంబుగఁజెఱకుగడను వామము నందున్
కుదురుగఁబట్టిన గణపతి
ముదమును గలిగించె బర్వి మోదకములకై !
~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
3)
గణపతి నవరాత్రులు సందర్భంగా మూడవ రోజు చిత్రం.
1)ఉ॥
శ్రీయని సింధురాననుని చిత్తమునందున నిల్పికార్యముల్
జేయ జయంబుగల్గునని సిద్ధివినాయక!యెల్లరీభువిన్
నీయరుదైనరూపమును నెమ్మిభజింపగ భాద్రమందునన్
శ్రేయమొసంగి స్వామి! గుణ శీలము లిత్తువు భక్తకోటికిన్ !
2)
మ ॥
సరినీకెవ్వరొసంగగా వరములన్ సామాన్య సంసారికిన్
గరికన్ బెట్టిన సంతసించి మిగులన్ గైకొందు వుండ్రాళ్ళు నీ
గరుణాపూరిత మైనదృక్కులు వినా కల్మేది లోకంబులో !
వరదా! భారము నీదియంచు దల నీ పాదంబుపైనుంచితిన్ !
~~~~~~~
4)
గణపతి నవరాత్రులు సందర్భంగా నాల్గవ రోజు పద్యాలు
ఉ. మా ॥
తాండవ నృత్యమున్ బునుక తాలుపు జేయు ప్రదోషవేళలో
మెండుగ మ్రోయు గజ్జలకు మేదిని సైతము గంపమొందగన్
తొండము దాల్చినట్టి దొర మూషిక వాహను డయ్యెడన్ యెదల్
నిండగ గూడియాడుచుమృదంగపు వాదన జేయ మ్రొక్కెదన్!
తాత్పర్యము
~~
పరమేశ్వరుడు( పునుక తాలుపు) ప్రదోష వేళ తాండవనృత్యం చేస్తుంటే ఆ గజ్జల మోతకు భూమి కంపిస్తున్నది.
మూషిక వాహనుడైన గణపతి తండ్రితో కలిసి నృత్యం చేస్తూ మృదంగం వాయిస్తుంటే ఆమృదంగ నాదానికి అందరి హృదయాలలో సంతోషం నిండింది. ఆ నృత్యగణపతికి నా నమస్కారము .
కం॥
నిత్యుండగు శివుడాడగ
నత్యంతోత్సాహియగుచు నగజా సుతుడున్
నృత్యము జేయగ గిరిజ, య
పత్యమునాశీర్వదించి బల్కెపొగడ్తల్ !
భావము
~~~
నిత్యుడైన పరమేశ్వరుడు తాండవమాడు సమయములో
ఉత్సాహముతో గణపతితానూ నృత్యం చేస్తుంటే పార్వతి తన కుమారుని చూచి దీవించి పొగడ్తలలో ముంచివేసింది!
5)
గణపతి నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు చిత్రం.
ఉ॥
భక్తుల పాలికల్పతరువైన గణేశుని నమ్ముకున్నచో
శక్తిని పొందగా గలము సంశయ మొందక నమ్మిచూడుడీ
యుక్తపు జన్నమే చదువు. హోతగఁదానగు, వేద సం
ప్రోక్తములైన జ్ఞానమును బొందగ జేయునిచ్చలున్!
తాత్పర్యము
~~~~~~~
భక్తుల పాలిట కల్పవృక్షము వంటి గణపతిని నమ్ముకుంటే శక్తి పొందగలము. సందేహం వద్దు. నమ్మి చూడండి. విద్య మంచి యజ్ఞము వంటిది. దానికి యజ్ఞకర్తవంటి వాడు వినాయకుడు. వేదాలలో చెప్పబడిన నిజమైన జ్ఞానం ప్రసాదింపగలవాడు గణనాథుడు!
చం॥
గిరిజకుమార! విఘ్నములు కీడులు దొల్గగజేసియెప్పుడున్
ధరణిని గాచి బ్రోవుమయ దక్షిణ హస్తపు రక్షముద్రతో !
వరదుడసిద్ధిబుద్ధులను భార్యలతోఁగను విందు జేయుచున్
నరులకు నిత్యజీవితపు నైతిక వర్తన నేర్పిబోవయా!
తాత్పర్యము.
~~~~~~~
ఓ పార్వతీ పుత్రా! మా విఘ్నాలను, కష్టాలను పోగొట్టి నీ అభయముద్రతో ఈ అవనిని కాపాడు స్వామీ! సిద్ధి బుద్థులను భార్యలతో మాకు దర్శనమిచ్చి ఆనందింపజేయవయ్యా! ఈ మనుషులకు నీతితో కూడిన ప్రవర్తన నేర్పి వెళ్ళు!
సిద్ధి కోరిక నెరవేరడానికి , బుద్ధి సత్ప్రవర్తనకు ప్రతీకలు గనక వారితో వస్తే మనకు కోరికలు నెరవేరి, మంచిబుద్ధులు వస్తాయని భావం.
~~~~~~~~
6)
గణపతి నవరాత్రులు సందర్బంగా ఆరవ రోజు చిత్రం.
యుక్తి గణపతి/ శక్తి గణపతి
1)
కం॥
వెనకయ్య షణ్ముఖుని వలె
జని, దా విశ్వములజుట్ట సందేహింపన్
గనపడె నొకమార్గంబన
జననీ జనకులకుమ్రొక్కి జయమును బొందెన్ !
*భావము=
వెనకయ్య= వినాయకుడు
గణాధిపతి పదవికి ఎవరు ముందు విశ్వాన్ని చుట్టి వస్తారో వారు అర్హులు అని పరమేశ్వరుడు అనగా , వినాయకుడు కుమారస్వామివలె వేగంగా విశ్వప్రదక్షిణము చేయలేక తన జననీ జనకులే తనకు విశ్వంతో సమానులని వారి చుట్టూ ప్రదక్షిణం చేసి తల్లిదండ్రులను మెప్పించి గణాధిపతి అయినాడు. అన్ని చోట్ల కుమారస్వామికి తనకన్నా ముందు తన సోదరుడు వెళ్ళడం కూడ కనబడటం వినాయకుని భక్తి తత్పరతకు నిదర్శనం.
2)
మత్తకోకిల ॥పంచపాది
దోషకారగు వేల్పునొక్కని దూఱియింద్రుడుఁబొమ్మనన్
మూషికాసురుడై జనించెను భూమియందున నీచుడై
శేష ధాన్యము లన్నిమ్రింగగ జేరె నాశ్రమ వాటికల్
భీషణుండు గణేశుడంతట వేసి పాశము బట్టగన్
శోషబొందిన మూషికమ్మయె శూర్పకర్ణుని బండిగన్!
*భావము-
స్త్రీలపట్ల దోషపూరితమైన స్వభావం చూపిన , సభకు ఆటంకం కలిగించిన ఒక గంధర్వునికి ఇంద్రుడు ఎలుకగా పుట్టమని శాపమిచ్చాడు. వాడు మూషికమై ఆశ్రమాలలో ఋషులకు శాంతిలేకుండా చేస్తుంటే విఘ్నేశ్వరుడు తన పాశంతో బంధించి వాహనంగా చేసుకున్నాడు.
చంచలమైన మనస్సును మన చెప్పుచేతలలో ఉంచుకోవాలని అంతరార్థం.
~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
7)
గణపతి నవరాత్రులు సందర్భంగా ఏడవ రోజు పద్యాలు
శా॥
హేరంబా!నినుబూజసేయుటగనన్ హ్రీంకారి మేల్గూర్పదే!
నేరంబుల్ మదినెంచకే దయగనన్ నిర్విఘ్నమౌ కార్యముల్
భారంబుల్ దొలగన్ జనంబులకు, మాప్రారబ్థముల్ దీరగా
రారమ్మంచునుబిల్చి యూర్జితముగా లంబోదరున్ గొల్వమే!
భావము=హేరంబుడవైన గౌరీ సుతా!నీపూజ చేయడంచూసి ఆ పార్వతీ దేవి మేలు కలగజేస్తుంది.
మా తప్పులు మన్నించి దయతో నీవు చూడగా మాకార్యములు నిర్విఘ్నముగా పూర్తవుతాయి.జనుల సమస్యలు పోయి ప్రారబ్థములు తీరగలవు. అందుకే ఆ లంబోదరుని స్వాగతించి
ఘనంగా ఉత్సవాలు చేస్తాము.
2)
ఉ.మా॥
సూర్యుని తోసమానమగు శుష్మము గల్గిన వక్రతుండనీ
తూర్యపు మ్రోతమాత్రమున దూలగ జేతువు శత్రుసైన్యమున్
శౌర్యము నెంచమాదరమె,
సాయుధరూపము జూడసాధ్యమే!
ధైర్యము గల్గునిన్ దలపఁద్రస్నువు కైనను విఘ్ననాయకా!
భావము-
సూర్యునితో సమానమైన తేజస్సు గల వక్రతుండా! నీ వాద్య ఘోష వినబడినంత మాత్రాన శత్రుసైన్యాలు తూలిపోతాయి.నీ పరాక్రమమెంచడం మా తరమా! నీవు ఆయుధాలను ధరించిన రూపం చూడగలమా! (త్రస్నువు)పిరికి వాడికి కూడ నిన్ను తలుచుకుంటే ధైర్యం వస్తుంది .
8)
గణపతి నవరాత్రులు సందర్భంగా ఎనిమిదవ రోజు చిత్రం. పద్యాలు
~~~~~~~~~~
వాణీ గణపతి/ లక్ష్మీ గణపతి/ శక్తి గణపతి
~~~~~~~~~~~~
చం॥పంచపాది
చదువుల తల్లిశారదకు సంపదలిచ్చెడి మాత లక్ష్మికిన్
సదమలయైన గౌరికిని చక్కగ నర్చన జేయభాద్రమున్
కొదువను మాట యుండదిక కోరిన వన్నియు కూడు నింటిలో
ముదముగనమ్మలందరును మోదక హస్తుని ముద్దులాడుచున్
మృదువుగనిత్తురన్నిటిని మీకిక చింతలులేవు లేవనన్!
భావము-
————
భాద్రపద చతుర్ధి నాడు వినాయకుని పూజతో బాటు చదువులతల్లి శారదను, సంపదలిచ్చే జనని లక్ష్మీదేవిని, శక్తినిచ్చే వినాయకుని కన్నతల్లి గౌరిని పూజిస్తే ముద్దులొలికే బాలుని ముద్దాడే ముగ్గురమ్మలూ మనకు చదువు, సంపద, శక్తి ప్రసాదిస్తారు.
2)ఉ. మా॥
వాదము లందుగెల్వగను వాక్కున నిల్చును వాణి రూపుడై
పేదల బాధతీర్చగను పెన్నిధి తానగు లక్ష్మి రూపుడై
వేదిని యష్టపత్రముల వేయగ గన్పడు శక్తి రూపుడై!
భేదము లేకనిచ్చునివి పెంపుగ నీశ్వర బుత్రుడీవిధిన్ !
*భావము
~~~~~~
విద్య సంబంధమైన చర్చలలో వాణీ గణపతిగా వాక్కున నిలుచును.
పేదలు పూజిస్తే లక్ష్మీగణపతిగా సంపదలిచ్చి బాధలు పోగొట్టగలడు.
పీఠము మీద అష్టదళ పద్మము వేస్తే
గౌరీ పుత్రుడు గనక శక్తి గణపతై శక్తి నిస్తాడు।
ఈ విధంగా మనకోరికలన్నీ భేదము చూపక తీర్చే దైవము గణపతి .
🌷9 వరోజు
1)చం॥
గజముఖ నిన్నుమామదిని గాఢముగానిలుపంగజూడగన్
గజిబిజియై చెలంగునది కాచి ఘమైననురద్దు బెట్టుచున్
రజినొకటిచ్చి నేర్పవయ, రాగము వీడి చరించి భూమిపై
సుజనతనొంది జీవితము శోభిల జేయుము విఘ్ననాయకా!
కాచిఘము- ఎలుక
రజి- పాశము
రద్దు- అల్లరి
॥భావము॥
గజాననా! నిన్ను మామనసులో గాడంగా నిలుపుకోవాలని ప్రయత్నిస్తే మా మనస్సు ఎలుకలాగా చంచలమై అల్లరి పెడుతుంది. నీ పాశం మాకొకటిచ్చి ఈ మనసును బంధించడం నేర్పరాదా! అప్పడు మేము ఈ కోరికలను వీడి బ్రతకడం తెలుసుకుంటాము. మా జీవితము శోభించేవిధంగా మేము సుజనులమయ్యే లాగా చేయి స్వామీ!
2)సీ॥
వినుటముఖ్యమనుచు వివరించుఁగర్ణముల్
నిశితదృష్టికి గుర్తు నేత్ర యుగళి !
జ్ఞానసంకేతంబు గణపతి శీర్షము
బ్రహ్మాండ భాండంబు వక్షణంబు!
పత్రియన ప్రకృతి పరమౌషధములవి
దంతమాయుధమాయె దంభకులకు !
అసురుల నణచగ నాయుధంబులబట్టి
షోడశ గణపతి చొక్కుమీరె!
తే.గీ
మట్టి గణపతి పూజతో మహికి మేలు!
ఏటి పాయన పవళించి నేటి నుంచి
మేటి ఫలసాయ మొసగుపైయేటి కనుచు
వీడుకోలును చేతురు వేడ్కమీర!
॥భావం॥
నీ పెద్ద చెవులు ఏదైనా బాగా వినాలనడానికీ, నీ కళ్ళు నిశితంగా దేనినైనా పరిశీలించాలనడానికి గుర్తు.
నీ బొజ్జ బ్రహ్మాండమే నీలో ఉందని చెబుతుంది.
నీ పెద్దతల జ్ఞానానికి ప్రతీక।నిన్ను పూజించేవి ఆకులూ అలములు కావు. అవి ఔషధాలు. అవసరమైతే మనశరీరభాగమే ఆయుధం కావాలని నీ చేతిలోని దంతం గుర్తుచేస్తుంది.
మట్టి గణపతే మహాగణపతి . ఎందుకంటే ఆ మట్టి మరల భూమికి చేరి భూసారాన్ని పెంచి పై సంవత్సరానికి ఫలసాయాన్నిస్తుంది. కాలుష్యం పెంచని మట్టి గణపతే మేలు. ఈ విశేషాలన్నీ తలుచుకుంటూ ఏటి పాయపై నిను పవళించమని వీడ్కోలు చెబుతారు.
3) కం॥
తొమ్మిది దినముల బూజల
నిమ్ముగగొనితరలినాడు హేరంబుడిలన్
ఇమ్మహి విశేషముల, మీ
యమ్మకు వినిపింపవయ్య యఖిలాండపతీ 🙏💐
4)
ఉత్సాహ వృత్తము॥
కరిముఖునికి యీయ రండి కప్పురముల హారతిన్
పురహరసుత గొనుము పూర్ణ కుంభ హారతిన్
ధరను గాచు స్వామి కిడుడు ధవళ హారతిన్
దొరలు తప్పు గాయ నిత్తు ధూప హారతిన్
పరమ పురుష స్వీకరించు పంచహారతుల్ !
॥భావం॥
కరివదనునకు కర్పూర హారతినిచ్చి, పురహరుడైన శివుని కుమారునకు పూర్ణ కుంభ హారతినిచ్చి, ఈ ధర ( భూమి) కాపాడే వానికి ధవళ హారతి నిచ్చి, దొర్లే తప్పులు మన్నించే వానికి ధూపహారతినిచ్చి , పంచహారతులతో పరమ పురుషుడైన పార్వతీ పుత్రునకు ఈ ఏడాదికి వేడుకోలు మరియు వీడుకోలు।
~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
రచన: డా. ఉమాదేవి జంధ్యాల గాత్రం: (To be updated) సంగీతం: (To be updated)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి